ముగిసిన ఏపీ కేబినెట్ : వెల్లడైన కీలక నిర్ణయాలు

అమరావతి సెప్టెంబర్ 3 :  ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మంత్రివర్గం ఆమోదం తెలిపిన కీలక నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు.

రాష్ట్రంలో ఆన్‌లైన్‌ రమ్మీ, పోకర్‌ వంటి జూద క్రీడలపై నిషేధాన్ని ఆమోదించారు. నిర్వాహకులు మొదటిసారి పట్టుబడితే ఏడాది జైలు, రెండోసారి పట్టుబడితే రెండేళ్ల జైలు, జరిమానా విధించనున్నామని తెలిపారు.

వైఎస్సార్‌ ఉచిత విద్యుత్‌ నగదు బదిలీ పథకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపిందని, డిసెంబర్‌ 1 నుంచి శ్రీకాకుళం జిల్లాలో పైలట్‌ ప్రాజెక్టుగా ఉచిత విద్యుత్‌ నగదు బదిలీ పథకం అమలు చేయనున్నామని అన్నారు. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉచిత విద్యుత్‌ నగదు బదిలీ పథకం అమలు కానుంది తెలిపారు.

పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఉన్న లక్ష అనధికార ఉచిత విద్యుత్‌ కనెక్షన్ల క్రమబద్ధీకరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

భూమిని కౌలుకిచ్చిన రైతులకూ ఉచిత విద్యుత్‌ పథకం నిరంతరాయంగా అమలు చేయాలని నిర్ణయించి, విద్యుత్‌ బకాయిల చెల్లింపు బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని తీర్మానించింది.

రాష్ట్రంలో ఎండీవోలకు డీడీవోలుగా ప్రమోషన్‌ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ప్రకాశం బ్యారేజీ దిగువన 3 టీఎంసీల సామర్ధ్యంతో మరో రెండు బ్యారేజీల నిర్మాణానికి కేబినెట్ ఆమోదించింది. రూ.1350 కోట్ల ఖర్చుతో కృష్ణానదిపై చోడవరం వద్ద బ్యారేజీ నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదించింది. రూ. 1280 కోట్లతో మోపిదేవి వద్ద కృష్ణానదిపై మరో బ్యారేజీ నిర్మాణానికి ఓకే చెప్పింది.

రూ.15380 కోట్లతో ఉత్తరాంధ్రలోని మెట్టప్రాంతాల కోసం బాబూజగజ్జీవన్ రామ్‌ సుజల స్రవంతి పథకంతో 8 లక్షల ఎకరాలకు లబ్ది చేకూరుతుంది.
రాయలసీమ కరువు నివారణ పథకం కింద 14 పనులకు త్వరిత గతిన పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

బాపట్ల, మార్కాపురంలో మెడికల్‌ కాలేజీ ఏర్పాటు కోసం స్ధల కేటాయింపుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం పొడిగించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఏపీ ఫిషరీస్‌ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 

admin: