Extension of ban on international flights

వందే భారత్ మిషన్ పై కీలక ప్రకటన : అంత‌ర్జాతీయ విమానాల‌పై నిషేధం పొడిగింపు

అంతర్జాతీయం

డిల్లీ, ఆగష్టు 31: దేశంలో అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఉన్న నిషేధాన్ని విమానయాన రంగ నియంత్రణ సంస్థ డీజీసీఏ మరోసారి పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. క‌మ‌ర్షియ‌ల్ ప్యాసింజ‌ర్ ఫ్ల‌యిట్ల‌పై ఉన్న నిషేధాన్ని సెప్టెంబ‌ర్‌ 30వ తేదీ వ‌ర‌కు పొడిగిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ప్రకటించింది. అయితే ఈ నిబంధ‌న కార్గో విమానాల‌కు ఇంకా డీజీసీఏ అనుమ‌తి ఉన్న విమానాల‌కు కూడా వ‌ర్తించ‌దని కేంద్ర విమానయాన శాఖ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. డీజీసీఏ ఎంపిక చేసిన రూట్ల‌లో మాత్రం అధికారిక అనుమ‌తి పొందిన అంత‌ర్జాతీయ విమానాల‌కు అవ‌కాశం ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపింది. అయితే భారత్ తో ఒప్పందం కుదుర్చుకున్న అమెరికా , ఫ్రాన్స్ దేశాలకు మాత్రమే ప్రస్తుతం నడుస్తున్నాయి. కరోనా నేప‌థ్యంలో దేశంలో మార్చి నుంచి అంత‌ర్జాతీయ విమానాల రాక‌పోక‌ల‌పై నిషేధం అమలవుతున్న విష‌యం తెలిసిందే.

కాగా కరోనా లాక్‌డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భార‌తీయుల‌ను తీసుకువ‌చ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం వందేభార‌త్ మిష‌న్ చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. మే 7న ప్రారంభమైన ఈ మిషన్ ద్వారా ఇప్పటి వరకు విదేశాల్లో చిక్కుకున్న 12 లక్షల మందికిపైగా భారతీయులను స్వదేశానికి తీసుకురావడం జరిగింది. సెప్టెంబ‌ర్ ఒక‌ట తేదీ నుంచి 31 వ‌ర‌కు ఆర‌వ ద‌శ వందేభార‌త్ మిష‌న్ చేప‌ట్ట‌నున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఎయిర్ ఇండియా రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 1-30 మధ్య ప్రయాణించడానికి టికెట్ బుకింగ్స్‌ను ప్రారంభించినట్లు పేర్కొంది. ఆరో విడత ‘వందే భారత్ మిషన్’లో భాగంగా.. యూఏఈ నుంచి ఇండియాలోని 18 నగరాలకు దాదాపు 400 విమానాలను నడపనున్నట్లు వెల్లడించింది.

Leave a Reply