జనగామలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ అవగాహన కార్యక్రమం
జనగామ, జూన్ 26: అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా స్థానిక నెహ్రూ పార్క్ వద్ద గల కామాక్షి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డిసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీలు అంకిత్ కుమార్ శంఖ్వార్, భీం శర్మ, నర్సయ్యలు, డీడబ్ల్యూఓ జయంతి, డీఈఓ రాము, డీఎంహెచ్ హరీష్ రాజ్ లతో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నేడు (జూన్ 26) మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్న వేళ వాటిని అరికట్టడానికి ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. మత్తు పదార్థాలకు బానిసైతే సమాజానికి చాలా ప్రమాదమని, ప్రధానంగా ఈ మాదకద్రవ్యాలు మనిషి యొక్క ఆలోచనా పరిజ్ఞానం, ఆలోచించే విధానం తగ్గిపోతాయని, దీంతో వ్యక్తి యొక్క ఆలోచనా పరిపక్వతను, సామర్థ్యాన్ని హరించేస్తాయని పేర్కొన్నారు. అలాగే అతిగా మొబైల్ ఫోన్ వాడకం కూడా విద్యార్థుల ఏకాగ్రతను నశింపజేస్తుందని, దేశంలో మొత్తం నాలుగు కోట్ల మంది ఈ మత్తుకు బానిస అయ్యారని తెలిపారు. అదే విధంగా మద్యపానం, ధూమపానం కూడా దీని కిందకు వస్తాయని, జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి బానిసత్వం నుంచి బయటకు రావాలని సూచించారు. ఇందుకోసం మనందరం సమిష్టిగా కృషి చేయాలని, ఎవరైనా ఈ మత్తు పదార్థాలను ఉపయోగించిన, క్రయవిక్రయాలు చేసినా తమ దృష్టికి తీసుకురావాలని, అలాంటి వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించార. అలాగే దీనిపై సమాచారం ఇచ్చిన వారికి తగిన పారితోషికంతో పాటు సత్కరిస్తామని తెలిపారు. మాదకద్రవ్యాల వాడకం అనేది చాలా తీవ్రమైన సమస్యని, ఇది ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామాలకు కూడా విస్తరించిందని, గ్రామీణ యువకులు ఈ మత్తు పదార్ధాలకు బానిస అవ్వకూడదని, సినిమాల్లో చూపించిన విధంగా చెడును అనుకరించొద్దని, మంచిని మాత్రమే తెలుసుకోవాలని అన్నారు.
సిగరెట్ వినియోగం వల్లా ఊపిరితిత్తుల క్యాన్సర్, పొగాకు క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని, ఇలాంటి చెడు అలవాట్లకు అందరూ దూరంగా ఉండాలని, దీనికి అందరూ సమన్వయంతో కృషి చేయాలని కోరారు. అలాగే అన్ని మండల కార్యాలయాల్లో, ప్రతి ఒక్క విద్యాసంస్థలో ఈ టోల్ ఫ్రీ నంబర్ – 14446 ను ప్రదర్శించాలని, దీనిపై విస్తృత స్థాయి ప్రచారం గావించి అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం డీసీపీ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నిర్మూలనకు అందరం ప్రతిజ్ఞ చేయాలని, జిల్లాలో మత్తు పదార్థాల నిషేధానికి కృషి చేయాలని, ప్రతి బడిలో వారంలో ఒకరోజు విద్యార్థుల బ్యాగ్ లను తనిఖీ చేయాలని, గుట్కా గంజం మద్యపానం, బెట్టింగ్, పేకాట ఇవన్నీ కూడా దీని కిందికి పిస్తాయని, పిల్లల పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ శ్రద్ధ వహించాలని సూచించారు. పిల్లల్లో ఏమైనా మార్పు కనిపిస్తే వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇవ్వాలని తెలిపారు. అనంతరం ఈ నేపథ్యంలో మాదకద్రవ్యాల నిర్మూలనకు జిల్లా కలెక్టర్, డీసీపీ, ఏసీపీలు, ఇతర అధికారులు, విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. అదే విధంగా సెల్ఫీ పాయింట్, సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అదే విధంగా మాదకద్రవ్యాల నిషేధానికి మిషన్ పరివర్తన కింద పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. అంతకుముందు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, డీసీపీ, ఏసీపీలు, ఇతర అధికారులు మిషన్ పరివర్తన కింద స్థానిక చౌరస్తా నుంచి నెహ్రూ పార్క్ వరకు మానవహారం ఏర్పాటు చేసి, కామాక్షి ఫంక్షన్ హాల్ కు అవగాహన ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ ప్రభావతి, రిసోర్స్ పర్సన్ డా. సిద్ధా రెడ్డి,ఎస్ఆర్వో, కమ్యూనిటీ మొబిలైజర్, సీడీపీఓలు, ఎస్ఐ్బలు, సీఐలు, సఖి సిబ్బంది, ఆశాలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఉమెన్స్ డెవలప్మెంట్ సొసైటీ అనే స్వచ్ఛంద సంస్థ డి అడిక్షన్ సెంటర్ కోఆర్డినేటర్ బాలకృష్ణ మరియు సిబ్బంది ఈ యొక్క మీటింగ్ లో పాల్గొనడం జరిగింది, వివిధ పాఠశాలల, కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.