Ram Charan and Sharwanand

అంత్యక్రియల్లో పాల్గొన్న రామ్ చరణ్, శర్వానంద్

ఆంధ్రప్రదేశ్, టాలీవుడ్

నెల్లూరు, సెప్టెంబర్ 1:  టాలీవుడ్ యువ హీరోలు రామ్ చరణ్, శర్వానంద్ లు నెల్లూరులో ఆకస్మిక పర్యటన చేశారు. ప్రముఖ నిర్మాత, యూవీ క్రియేషన్స్ అధినేతలలో ఒకరైన వంశీ కృష్ణా రెడ్డి తండ్రి వేమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హైదరాబాద్‌లోని తన స్వగృహంలో ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఈయన డీసీసీబీ మాజీ చైర్మన్‌ వేమిరెడ్డి శ్యాంసుందర్‌రెడ్డి తమ్ముడు. రాజగోపాల్‌రెడ్డి భౌతికకాయాన్ని ఆయన స్వగ్రామం నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం ఈదగాలి తీసుకువచ్చి సోమవారం అంత్యక్రియలు నిర్వహించారు. రాజగోపాల్ రెడ్డి రామ్ చరణ్, శర్వానంద్‌లకు అత్యంత ఆప్తుడు కావడంతో ఈ సినీ హీరోలు ఇద్దరు హాజరయ్యారు.

అనుకోకుండా రామ్ చరణ్, శర్వానంద్ లు రావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో యువత ఇక్కడకు తరలివచ్చారు. దీంతో, అభిమానులను నిరుత్సాహపరచకుండా దూరంగా ఓ భవనంపై నిలబడి బయట వేచి ఉన్న హీరోలిద్దరూ వారికి అభివాదం చేశారు. అనంతరం అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్నారు. అంత్యక్రియల సమయంలో కూడా అభిమానుల హడావుడి ఎక్కువగానే ఉంది. ఫొటోలు, వీడియోలు తీయడంలో ఫ్యాన్స్ మునిగిపోయారు. కానీ, వారిద్దరు మాత్రం కార్యక్రమం ముగిసేంత వరకు మౌనంగా ఉన్నారు. కార్యక్రమం అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయారు.

 

 

Leave a Reply