రైతులు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి వస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తా: బాలినేని
అమరావతి, సెప్టెంబర్ 2: ఏపీలో ఉచిత విద్యుత్ పథకం కింద నగదు బదిలీ చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి దీనిపై స్పందించారు. రైతులకు ఉచిత విద్యుత్ లో అన్యాయం జరుగుతుందని ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి విమర్శించారు. రైతుల ఉచిత విద్యుత్ ను 30 ఏళ్లపాటు ఇస్తామని, అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదని చెప్పారు. ఉచిత విద్యుత్ ఇవ్వలేకపోతే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆయన సవాల్ చేశారు.
రైతులకు ఉచిత విద్యుత్ అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వైసీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామని స్పష్టం చేశారు. కేంద్రం ఆదేశాల ప్రకారం వ్యవసాయ మోటార్లకు కూడా స్మార్ట్ మీటర్లు పెట్టవలసి ఉంటుందని ఆయన తెలిపారు. రైతులు బిల్లులు గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఉచిత విద్యుత్ కు ఇచ్చే నగదు విదానంలో మార్పు జరుగుతోందని వ్యాఖ్యానించారు. రైతుల ఖాతాలలో నగదు బదిలీ చేస్తామని, దానిని వారు ట్రాన్స్ కో కు చెల్లించాలని ఆయన వివరించారు. టీడీపీ హయాంలో విద్యుత్ చార్జీలు పెంచారని ధర్నాలు చేసి కొందరు ప్రాణాలు కోల్పోయారని బాలినేని వెల్లడించారు. రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తామని వైఎస్ హామీ ఇస్తే, తీగలపై బట్టలు ఆరేసుకోవాలని చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు.