ప్రధాని మోదీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్
డిల్లీ, సెప్టెంబర్ 3: సుమారు 2.5 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న దేశ ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ఖాతా గురువారం తెల్లవారుజామున 3.15 గంటలకు హ్యాకింగ్ కు గురైంది. ఈ విషయాన్ని ట్విట్టర్ సంస్థ అధికారికంగా ద్రువీకరించింది. హ్యాకర్లు జాతీయ రిలీఫ్ ఫండ్‌కు క్రిప్టోకరెన్సీ రూపంలో విరాళాలు ఇవ్వవచ్చు అని ఆ వెబ్‌సైట్ పేజీలో ట్వీట్లు పోస్ట్ చేసినట్లు కనిపించాయి. దీంతో ప్రధాని అకౌంట్ హ్యాక్ అయినట్లు ద్రువీకరించారు. ఈ సంఘటనపై ట్విట్టర్ సంస్థ ప్రతినిధి స్పందిస్తూ.. మోదీ ట్విట్టర్ అకౌంట్ జాన్ విక్ పేరుతో హ్యాకింగ్ కు గురైనట్లు తెలుసుకుని, అకౌంట్‌ను మళ్లీ సెక్యూర్ చేశామని, ఈ సంఘటనను నిరంతరం దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. అయితే ప్రధానికి చెందిన ఇతర అకౌంట్లపై ప్రభావం పడిందా అన్న విషయం తమకు తెలియదని అన్నారు.
క్రిప్టోకరెన్సీ పద్ధతితో విరాళాలు ఇవ్వాలంటూ వచ్చిన ట్వీట్లను ప్రస్తుతం తొలగించారు. కాగా ఇటీవలే అనేక మంది ప్రముఖుల ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్ అయిన విషయం తెలిసిందే. ఇదే విధంగానే అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, టెస్లా సీఈవో ఎలన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, వ్యాపార దిగ్గజం వారెన్ బఫెట్ సహా పలువురు ప్రముఖుల ఖాతాలను హ్యాక్ చేశారు. ఇలా హ్యాక్ చేసిన వారి ఖాతా నుండి బిట్ కాయిన్ స్కామ్‌కు ప్రయత్నించారు. వెయ్యి డాలర్ల క్రిప్టోకరెన్సీ పంపిస్తే.. అందుకు రెట్టింపు మొత్తాన్ని తిరిగి ఇవ్వనున్నట్లు హ్యాకర్లు ఆ ఖాతాల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అకౌంట్‌ను కూడా సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేసినట్లు తెలుస్తోంది. ఎక్కువగా జూలై నెలలో టెక్నాలజీ దిగ్గజాలు, రాజకీయవేత్తలు, సెలబ్రిటీల అకౌంట్లు హ్యాక్ అయ్యాయి.