‘ఆదిపురుష్’లో ప్రభాస్ ను ఢీ కొనేందుకు సైఫ్ అలీ ఖాన్ షురూ
హైదరాబాద్, సెప్టెంబర్ 3: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించనున్న భారీ పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్.’ తాజాగా ఈ చిత్రానికి సంభందించి మరో ఆసక్తికరమైన అప్ డేట్ వచ్చింది. ‘ఆదిపురుష్’లో విలన్ పాత్రను ఎవరు పోషిస్తున్నారన్నది వెల్లడైపోయింది. అందరూ ఊహించినట్టుగానే ఈ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నటించనున్నాడు. ఈ విషయాన్ని చిత్రం బృందం ఈ రోజు ఉదయం అధికారికంగా ప్రకటించింది.
ఆదికావ్యం రామాయణం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుండగా ఇందులో రాముడితో తలపడే రావణాసురుడి పాత్రను సైఫ్ అలీ ఖాన్ పోషిస్తున్నారు. `సైఫ్ అలీఖాన్ సర్‌తో పనిచేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అంతటి గొప్ప నటుడితో కలసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఆసక్తిగా వుందని ఈ సందర్భంగా ప్రభాస్ పేర్కొన్నాడు. ఇక హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ భాషల్లో ఈ చిత్రాన్ని సుమారు 350 కోట్ల బడ్జెట్టుతో నిర్మిస్తున్నారు.
అయితే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో మూడు సినిమాలున్నాయి. పాన్ ఇండియన్ స్టార్ అయ్యాక ప్రభాస్ మరింత స్పీడు పెంచి వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే రాధాక్రిష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రాధేశ్యామ్ తో పాటు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సైంటిఫిక్ డ్రామా కూడా చేస్తున్నాడు. ఇంకా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రూపొందిస్తున్న ఆదిపురుష్ సినిమా వచ్చే ఏడాది నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.. ఈ మూడు చిత్రాలు ప్రభాస్ అభిమానుల్లో బాగా ఆసక్తిని కలిగిస్తున్నాయి.