సోమవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు… కరోనా పరీక్షల తరువాతే అసెంబ్లీలోకి ఎంట్రీ
హైదరాబాద్, సెప్టెంబర్ 5: సెప్టెంబర్ 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కరోనా నేపథ్యంలో సమావేశం నిర్వహించడంపై మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ కమిటీ హాల్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఎమ్మెల్యేలు అందరూ కరోనా పరీక్షలు చేయించుకుని అసెంబ్లీలోకి రావాలి. అలాగే, అసెంబ్లీ సిబ్బంది, మార్షల్స్ అందరూ రెండు రోజుల ముందే కరోనా టెస్టులు చేయించుకోవాలి. కరోనా నెగిటివ్ వచ్చిన వారికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పీకర్ పోచారం స్పష్టం చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సభను నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.
కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని శాసనసభలో కొత్తగా 40 సీట్లు, మండలిలో కొత్తగా 8 సీట్లను ఏర్పాటు చేశామని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాకు తెలిపారు. అసెంబ్లీ, మండలిలో 6 అడుగుల భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. మీడియా ప్రతినిధులు, మంత్రుల వ్యక్తిగత సిబ్బందికి మాత్రమే అనుమతిస్తామన్నారు.