![Pawan Kalyan](https://telugu.telanganareport.com/wp-content/uploads/2020/09/pawan-kalyan-001-730x406.jpg)
పవన్ కళ్యాణ్ బర్త్ డే రోజున అభిమానులకు త్రిబుల్ ధమాకా
హైదరాబాద్, సెప్టెంబర్ 1: సెప్టెంబర్ 2 అంటే పవన్ కల్యాణ్ అభిమానులకు పండుగ రోజు లాంటిది. ఎందుకంటే, రేపు తమ అభిమాన కథానాయకుడు పుట్టినరోజు. సాధారణంగా అభిమాన హీరో పుట్టిన రోజు వస్తుందంటే ఆయన కొత్త సినిమా గురించి ఏదో ఓక అప్‌డేట్ గురించి ఎదురు చూస్తుంటారు అభిమానులు. అలాంటిది పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో బర్త్ డే అంటే కచ్చితంగా కొత్త సినిమా అప్డేట్ ఉండాల్సిందే…
పైగా 2019 ఎన్నికల అనంతరం, కొంత కాలం గ్యాప్ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ తిరిగి సినిమాలలో నటించడానికి ఒప్పుకున్నారు. ఇప్పటికే కొన్ని చిత్రాలను ప్రకటించారు కూడా. ఈ నేపథ్యంలో వస్తున్న బర్త్ డే కాబట్టి, దీనికి ఓ ప్రత్యేకత వుందని చెప్పుకోవచ్చు. అందుకు తగ్గట్టే భారీ సర్ ప్రైజ్ లు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు పవన్.
పవన్ కళ్యాణ్ ప్రధానంగా నటిస్తున్న “వకీల్ సాబ్ ” చిత్రంపై రేపు ఉదయం 9.09 నిమిషాలకు ఓ కొత్త కబురు ఉంటుందని దిల్ రాజు సంస్థ శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ ప్రకటించింది. అలాగే, క్రిష్ దర్శకత్వంలో పవన్ నటించే చిత్రానికి సంబంధించిన ఓ విశేషాన్ని కూడా రేపు మధ్యాహ్నం 12.30 నిమిషాలకు వదలనున్నారు.
ఇక, గతంలో తనతో ‘గబ్బర్ సింగ్’ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని రూపొందించిన హరీశ్ శంకర్ తో పవన్ ఇప్పుడు మరో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ సెప్టెంబర్ 2న సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు ఇవ్వనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.