
వైఎస్సార్‌కు నివాళి అర్పించిన జగన్
ఇడుపులపాయ సెప్టెంబర్ 2: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. ఇడుపుల పాయలోని వైఎస్‌ఆర్ సమాధి వద్ద అంజలి ఘటించారు. సీఎం జగన్, వైఎస్ విజయమ్మ సహా కుటుంబ సభ్యులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం వైఎస్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.
వారితో పాటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో వారంతా కలిసి పాల్గొన్నారు.
వైఎస్‌ఆర్ 11వ వర్థంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన తండ్రిని గుర్తు చేసుకున్నారు. ‘నాన్న మన మధ్య నుంచి దూరమై నేటికి 11 ఏళ్లు. ఆ మహానేత శరీరానికి మరణం ఉంటుంది కానీ, ఆయన జ్ఞాపకాలకు, పథకాలకు ఎప్పుడూ మరణం ఉండదు. నా ప్రతి అడుగులోనూ నాన్న తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తూనే ఉన్నారు’ అని జగన్ ట్వీట్ చేశారు.