Bandi Sanjay Kumar

టిఆర్ఎస్ వల్లే ఉపాధ్యాయులకు ఈ గతి పట్టింది : బండి సంజయ్ కుమార్

తెలంగాణ

హైదరాబాద్ సెప్టెంబర్ 5: టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకం వల్ల తెలంగాణలో ఉపాధ్యాయుల దుస్థితి తలచుకుంటే గుండె తరుక్కుపోతుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. నేడు టీచర్స్ డే సందర్భంగా హైదరాబాద్ లో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన మాట్లాడారు.

ఇవాళ ఉపాధ్యాయ దినోత్సవం.. మన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దే మార్గదర్శకులను పూజించాల్సిన రోజు. కానీ ఈరోజు అసమర్థ ప్రీపైమరీ స్కూల్ టీచర్ నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ లెక్చరర్ వరకు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్లు.. ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగులు అన్న తేడా లేకుండా అనేక కష్టాలకు గురవుతున్నారని అన్నారు.

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్ ను కట్టడి చేసేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో స్కూళ్లు, కాలేజీలు సహా విద్యాసంస్థలను బంద్ పెట్టాల్సి వచ్చింది. స్కూళ్లు, కాలేజీల్లో తరగతులు నడవడం లేదని ప్రైవేటు యాజమాన్యాలు టీచర్లు, లెక్చరర్లకు జీతాలు సగానికి పైగా కోత పెడుతున్నాయని అన్నారు. కొన్ని సంస్థలయితే అసలు మొత్తానికే జీతాలు ఇవ్వడం లేదని, చేతిలో చిల్లిగవ్వ లేక, ఉపాధ్యాయ రంగంలో ఉన్నవాళ్లు, వారి కుటుంబీకులు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీ కావన్నారు. ఎన్నికల వేళ టీచర్లకు అది చేస్తాం.. ఇది చేస్తాం అని వరాల జల్లులు గుప్పించిన సీఎం కేసీఆర్ ఈ కష్టకాలంలో వారిని పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు.

ధనిక రాష్ట్రం అని ప్రగల్భాలు పలికే ముఖ్యమంత్రి గారు ఉపాధ్యాయుల కోసం కనీస ప్యాకేజీ కూడా ప్రకటించలేదన్నారు.
అటు గవర్నమెంటు టీచర్ల పరిస్థితి విరుద్ధంగా ఏమీ లేదు. కరోనా పేరుతో జీతాలు కోత పెట్టిన కేసీఆర్ వారికిచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు.

ఇప్పటికైనా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టుదల వీడి లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న టీచర్లకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి, ఎన్నికల ముందు, అధికారంలోకి వచ్చాక టీచర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. టీచర్ల న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు భారతీయ జనతా పార్టీ వారి పక్షాన పోరాడుతుందని, వారికి అండగా ఉంటుందని హామీ ఇస్తున్నామన్నారు.

 

 

Leave a Reply